TSRTC Strike 14th Day : ఇంతకు ముందు జరిపిన విచారణలో హైకోర్టు ఆర్టీసీ ఉద్యోగులకు కాస్త అనుకూలంగా మాట్లాడింది. ఇవాళ హైకోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తిగా మారింది.
TSRTC Strike 14th Day : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండు వారాలుగా జరుగుతోంది. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ జేఏసీ పట్టుదలలకు పోతుండటంతో... ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ హైకోర్టు ఏం చెబుతుందన్నది చర్చనీయాంశం. నిజానికి హైకోర్టు నేటికల్లా ఏదో ఒక పరిష్కారం చూడాలని ప్రభుత్వానికి సూచించింది. కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పరిష్కారం లభించలేదు. ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. చర్చలకు పిలిస్తేనే తమ సమస్యలు చెప్పగలమనీ, తద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని ఆర్టీసీ కార్మిక జేఏసీ అంటోంది. హైకోర్టు సూచించినా కార్మికులకు ప్రభుత్వం సెప్టెంబర్ వేతనాలు ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కొంత మంది గుండెపోటుతో మృతి చెందారు. మరికొందరు ఆందోళనలు, అనారోగ్యాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఇవాళ గనక పరిష్కారం దిశగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వకపోతే... రేపు తెలంగాణ బంద్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ ముందుగానే ప్రకటించింది.